Friday, March 17, 2006

మన సంప్రదాయం, సంస్కృతులను విడిచిపెట్టవద్దు

సౌలభ్యత కోసం మనం ఎన్నో విధానాలను అవలంబించవచ్చుగాక...అయితే, మనకొక ఉనికిని ఇచ్చిన తెలుగుదనాన్ని, తెలుగు సంస్కృతిని మరచి పోవడం భావ్యమా? వస్త్ర ధారణ నుంచి ఆహారం వరకూ అన్నీ రోజు రోజుకూ మారిపోతున్నాయి. మనమే మన తెలుగింటిని మరచిపోతున్నాం. ఉదాహరణకు... పంజాబీలు, తమిళులను చూడండి. ఇప్పటికీ వాళ్లు తమ సంప్రదాయ వస్త్ర ధారణను ఎక్కడున్నా అనుసరిస్తున్నారు. పంజాబీలు తమ తలపాగాను విడిచిపెట్టారా ? తమిళులు తమ లుంగీ కట్టు మార్చుకున్నారా ? మరి మనమెందుకు మన పంచె కట్టును విడిచిపెట్టేసాం ? మన దేశమే కాదు విదేశాలను తీసుకున్నా... జపనీయులు, చైనీయులు, కొరియన్లు, ముస్లిం దేశాలవారు పాశ్చాత్య పద్ధతులను సౌలభ్యత కోసమే అనుసరించినా, వారి వారి సంప్రదాయ పద్ధతులను మార్చుకోలేదు. అంతే కాదు, ఇప్పటి తరంలో 90 శాతం మందికి మన ఊరగాయలు, పచ్చళ్లు, జంతికలు, కజ్జికాయలు, సున్ని ఉండలు తయారు చేయడం రాదు. విదేశీ సదుపాయాలను అనుభవించండి కానీ, మన సంప్రదాయం, సంస్కృతులను విడిచిపెట్టవద్దు.