Sunday, August 05, 2007

అంధుడైతేనేం... గానగంధర్వుడు!

అంధుడైతేనేం... గానగంధర్వుడు!

పిల్లనగ్రోవితో శ్రోతలను కట్టిపడేసే లింగయ్య
30 ఏళ్లుగా ఒకే ప్రదేశంలో...

లింగయ్యపై ఓ రచయిత పుస్తకం 'లే పెన్స్యూర్'

పిల్లనగ్రోవి అతని చేతిలో ఉందంటే చాలు... శ్రావ్యమైన సంగీతం బయటికి వస్తుంది. కొత్తవి, పాతవి ఏపాటలైనా శ్రోతలను కట్టిపడేసేలా వినిపిస్తాడు. రోజూ ఒక్కసారైనా అతని పాట వినకుంటే కొందరు ఆరోజు ఏదో కోల్పోయినట్లు భావిస్తారంటే అతిశయోక్తి కాదేమో!ఇంతటి ప్రతిభ ఉన్న ఈ గాయకుడు ప్రముఖ సంగీత కళాకారుడూ కాదు... సంగీతంలో శిక్షణ తీసుకున్నవాడూ అసలేకాదు. పిల్లనగ్రోవి వాయించడం అలవాటుగా మార్చుకుని యాచకవృత్తిలో బతుకీడుస్తున్న అంధుడు లింగయ్య.

న్యూస్‌టుడే, నల్లకుంట - ఈనాడు సౌజన్యం

పాలమూరు జిల్లా రేవల్లెకి చెందిన ఉల్లెందుల లింగయ్య(70) పుట్టంధుడు. బతుకుబాటలో నగరానికి వలస వచ్చాడు. శంకరమఠం నుంచి న్యూనల్లకుంట వంతెన వైపు వెళ్లే దారిలో ఒకేచోట కూర్చొని 30 ఏళ్లుగా పిల్లనగ్రోవితో మధుర స్వరాల్ని వినిపిస్తున్నాడు. ఐదారేళ్ల వరకూ తల్లే ఆలనాపాలనా చూసేది. ఆమె పోయాక ఎప్పుడూ ఇతనితోపాటే ఉండే మేనమామ బాగోగులు చూస్తున్నాడు. దారిన వెళ్లేవారు ఈయన సంగీతానికి ముగ్ధులై ఇచ్చే చిల్లరపైసలతోనే పొట్టనింపుకొంటాడు. ఆ దారిన పోయేవారికి లింగయ్య సుపరిచితుడే. కాస్తంత తీరిక దొరికితే అక్కడ ఆగి లింగయ్యతో తమకిష్టమైన పాట ఒకటి పాడించుకుని ఆస్వాదించే ఆయన అభిమానులూ ఉండటం విశేషం. లింగయ్య రెండుమూడు రోజులు అక్కడ కనపడకపోతే ఆయన గురించి ఆరా తీసేవారూ ఉన్నారని స్థానికులు చెపుతున్నారు. రోజూ దేవుని సుప్రభాతం వినడం కుదరకపోయినా... ఉదయం ఎనిమిదిన్నర వేళ లింగయ్య పిల్లన గ్రోవితో వినిపించే మధుర సంగీతాన్ని నిత్యం తప్పక ఆస్వాదిస్తామని ఆ ప్రాంతంలో ఉండే వారంటున్నారు.
ఆయనపై ఓ పుస్తకం 'లే పెన్స్యూర్'
ఈ అంధుడి గురించి పూర్తిగా అధ్యయనం చేసిన ఓ సామాన్య వ్యక్తి కందుకూరి రమేష్‌బాబు ఏకంగా లింగయ్యపై ఓ పుస్తకాన్నే రాశాడు. లింగయ్య కేవలం పిల్లనగ్రోవితో సంగీతాన్ని విన్పించడమే కాక మంచి ఆలోచనాపరుడని, అతనిలో ఓ కవీ దాగున్నాడని గ్రహించే తాను 'లే పెన్స్యూర్' పుస్తకం రాశానని రమేష్‌బాబు చెప్పారు.

పుస్తకావిష్కరణ... ఘన సన్మానం
'లే పెన్స్యూర్' పుస్తకాన్ని ఆదివారం లింగయ్య రోజూ కూర్చునేచోటనే ఆవిష్కరించారు.అందులోనూ ఓ ప్రత్యేకత... స్వీపర్ లింగమ్మతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. తర్వాత లింగయ్యను ఘనంగా సన్మానించారు. కొందరు తమకు తోచిన నగదునూ బహూకరించారు.కార్యక్రమానికి నిత్యం ఆయన పాటలు ఆస్వాదించే స్థానికులు, ఆ దారిన వెళ్లేవారు అధిక సంఖ్యలోనే వచ్చారు. మాజీ కార్పొరేటర్ వనం రమేష్ , పాత్రికేయుడు భాస్కరం, సాహిత్య అభిమాని వేదకుమార్, రచయిత నిజాం వెంకటేష్, కవి సిద్ధార్థ, ఆర్కే, చిత్రకారుడు చంద్ర హాజరయ్యారు.

0 Comments:

Post a Comment

<< Home