Monday, August 06, 2007

ఏమిటి మార్గం?

ఏమిటి మార్గం?

ధాతువులు క్షీణించటం, వాతం ప్రకోపించటం.. ఈ రెండూ వృద్ధాప్య వ్యాధులకు మూలం కాబట్టి.. ఈ సమయంలో తిరిగి ధాతువులన్నింటినీ పెంపొందించటానికి చేసే 'రసాయన చికిత్స' కీలకమని ఆయుర్వేదం నిర్దేశిస్తోంది.

అయితే 'చికిత్స' అంటే కేవలం ఔషధాలు తీసుకోవటం మాత్రమే కాదు. మన దినచర్య, ఆహార విహారాలు, మానసిక ప్రవృత్తి వంటివన్నీ కూడా చికిత్స కిందకే వస్తాయి. అందుకే ఈ రసాయన చికిత్స.. ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుంది.

1 ఆజశ్రిక రసాయనం: ఆజన్మాంతం మనందరం ధాతువులను సంరక్షించుకోవటానికి నిత్యం చేసుకోవాల్సిన చికిత్స ఇది. 'నిత్యం క్షీర ఘృతాభ్యాసీ' అంటుంది ఆయుర్వేదం. అంటే అందరం చిన్నతనం నుంచీ పాలు, నెయ్యి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల ధాతువులు సక్రమంగా ఉండి, దోషాలు ఎంత ప్రకోపించినా కూడా దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే మన దినచర్య, సీజన్లవారీగా అనుసరించాల్సిన రుతుచర్య కూడా చక్కగా ఉండాలి.

2. నైమిత్తిక రసాయనం: ఏదైనా వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత.. ఆ వ్యాధినిమిత్తంగా ఏయే ధాతువులు వికృతి చెందాయో వాటిని తిరిగి సరిచేసేందుకు.. చేసే చికిత్స ఇది. వృద్ధాప్యంలో దీని ప్రాముఖ్యం చాలా ఎక్కువ.

3. కామ్య రసాయనం: అవసరానికి తగినట్టుగా దేనినైనా పెంపొందించటానికి చేసే చికిత్స ఇది. ఉదాహరణకు ఆయుర్దాయాన్ని పెంచేందుకు, జ్ఞాపకశక్తిని పెంచేందుకు.. ఇలా రకరకాలుగా అవసరానికి తగినట్టుగా చేసే చికిత్స ఇది.

4. ఆచార రసాయనం: ఒక్కోసారి ఒత్తిడి తదితర పరిణామాల వల్ల మానసిక పరివర్తన రావటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటివి జరుగుతుంటాయి. ఇటువంటివి తలెత్తకుండా ఉండటానికి స్థిర చిత్తంతో ధ్యానం, యోగం, మానసిక వ్యాయామాల వంటివి చాలా అవసరం. ముఖ్యంగా అరిషడ్వర్గాలైన 'కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను' అదుపులో ఉంచుకోవటం, ఎప్పుడూ మంచిని కోరటం, మంచినే ఆలోచించటం, ఇతరులు కనబడితే మనమే ముందుగా పలకరించటం.. ఇలాంటివి ముఖ్యం. ఇవీ చికిత్సలో భాగమే.

ఇలా చక్కటి ఆహారం-వ్యాయామాలతో కూడిన దినచర్య, రుతుచర్య సక్రమంగా పాటిస్తుంటే ఆయుర్దాయం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. ధాతు క్షీణత తక్కువగా ఉంటుంది. అవసరాన్నిబట్టి ఇందుకు అనుగుణమైన ఔషధాలను కూడా తీసుకుంటే మలి వయసులో శరీరంలో వచ్చే మార్పులు, పరిణామాలను, వ్యాధులను ఎదుర్కొనే శక్తి కూడా బలపడుతుంది! మలివయసు ఆహ్లాదకరంగా గడుస్తుంది!!

కీళ్ల నొప్పులు
మన శరీరంలో ఒక్కో ధాతువును ఆశ్రయంగా తీసుకుని ఒక్కో దోషం ఉంటుంది. ఉదాహరణకు వాతం పెరిగితే అస్థి (ఎముకల) ధాతువు క్షీణిస్తుంది, అస్థి ధాతువు క్షీణిస్తే వాతం పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఈ రెండూ జరిగే అవకాశం ఉంది కాబట్టి సహజంగానే కీళ్ల నొప్పుల బాధలెక్కువ. దీనికి వాతాన్ని, నొప్పులను హరించే తైలాలు, ఘృతాలు, గుగ్గుల వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇందుకు: మహాయోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, వీటితో ఫలితం లేకపోతే స్వర్ణఖచిత మహాయోగరాజ గుగ్గుల వంటి రకరకాల గుగ్గులు తీసుకోవచ్చు. ఇవే కాకుండా వైద్యుల సలహాతో రాసనాది క్వాథం (కషాయం), మహారాసనాది క్వాథం, దశమూల క్వాథం, ధాతు పుష్టికి అశ్వగంధ చూర్ణం, అశ్వగంధారిష్టం వంటివి తీసుకోవచ్చు.

మలబద్ధకం
కఫ పిత్తాలు రెండూ కూడా ద్రవధాతువులు. ఒంట్లో ఇవి తగ్గి, వాతం ప్రకోపించినప్పుడు అది నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది, ఫలితంగా మలం గట్టిబడి 'మలబద్ధకం' ఏర్పడుతుంది. ఈ వాతప్రధానమైన మలబద్ధకాన్ని తగ్గించటానికి: రోజూ రాత్రిపూట పడుకునేటప్పుడు కొద్దిగా త్రిఫల చూర్ణాన్ని వేడి నీటితో తీసుకుంటే ఉదయాన్నే సాఫీగా ఒక్క విరేచనమవుతుంది. నిజానికి మలబద్ధకానికి ఆయుర్వేదంలో అపూర్వ ఔషధాలున్నాయి. కోరుకున్నన్ని సార్లు మాత్రమే విరేచనమయ్యేలా చేస్తుంది ఇచ్ఛాభేది రసం. ఇంకా స్వాదిష్ట విరేచన చూర్ణం, పంచ సకార చూర్ణం వంటివీ ఉన్నాయిగానీ వీటిలో లవణాలు ఉంటాయి కాబట్టి బీపీ ఉన్నవాళ్లు వీటిని వాడుకోకూడదు. అందరూ వాడుకోతగ్గది ఉసిరికాయ-కరక్కాయ-తానికాయల సమ్మిశ్రమమైన త్రిఫల! అసిడిటీ ఉన్నవాళ్లు అవిపత్తికర చూర్ణం రోజూ వాడుకుంటే ఆ బాధా తగ్గుతుంది, విరేచనమూ చక్కగా అవుతుంది.

జ్ఞాపక శక్తి
ఆయుర్వేదం ప్రకారం.. సమస్థితిలో ఉన్న కఫం జీవశక్తికి మూలం. వృద్ధాప్యంలో వాతం పెరిగి శరీరంలో కఫ ప్రభావం తగ్గుతుంది. దీంతో బుద్ధికి సంబంధించిన జీవకణాల్లో కూడా శక్తి తగ్గి.. జ్ఞాపకశక్తి సన్నగిల్లటం వంటి బాధలు మొదలవుతాయి. దీన్ని తిరిగి పెంపొందించేందుకు మేధ్య రసాయనాలైన బ్రాహ్మీ ఘృతం, బ్రాహ్మీ లేహ్యం, సారస్వత లేహ్యం, సారస్వతారిష్టం, శంఖపుష్పి, శంఖపుష్పి రసాయనం.. వంటివి బాగా ఉపకరిస్తాయి. 'ఘృతం అగ్నిమేధే కరోతి' అంటుంది ఆయుర్వేదం. అంటే నెయ్యి ఆకలినీ, మేధస్సునూ పెంచుతుంది. కాబట్టి చెంచా బ్రాహ్మీ ఘృతాన్ని వేణ్ణీళ్లలో, వేడి పాలలో వేసుకుని తీసుకోవటం మేలు చేస్తుంది.

దంత సమస్యలు
వృద్ధాప్యంలో దంత సమస్యలు కొంత ఎక్కువే. త్రిఫల చూర్ణాన్ని కొద్దిగా నీటిలో వేసుకుని కషాయం కాచుకుని దాన్ని పుక్కిలిస్తే దంత సమస్యలు అంతగా బాధించవు. ఇరిమేదాది తైలం చిగుళ్లకు రాసుకుంటే చిగుళ్ల వ్యాధులు, రక్తం రావటం వంటి బాధలు తగ్గుతాయి. దంత సమస్యలకు మలబద్ధకం కూడా కొంత వరకూ కారణమవుతుంది కాబట్టి లోపలికి త్రిఫల చూర్ణం తీసుకుంటే మేలు. నిత్యం త్రిఫల చూర్ణంతో దంతధావనం చేస్తే కదిలే దంతాలు క్రమేపీ గట్టిబడే అవకాశం కూడా ఉంటుంది.

నిద్రలేమి
నిద్రలేమి కూడా వాత ప్రధానమైన సమస్యే. దీనికి 'జటామాంసి క్వాధం' బాగా ఉపయోగపడుతుంది. జటామాంసి కొబ్బరి పీచు మాదిరిగా ఉంటుంది. దీన్ని కొద్దిగా నీటిలో వేసి కషాయం కాచుకుని రోజూ ఒక పావు గ్లాసు తీసుకుంటే నిద్ర లేమి సమస్య బాగా తగ్గుతుంది. శంఖపుష్పి సిరప్ కూడా నిద్ర పట్టేలా చేస్తుంది. వీటితో దుష్ప్రభావాలూ ఉండవు. పాలు కూడా నిద్రా జనకమైనవే. రాత్రిపూట గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది.

పడిపోవటం
తల తిరగటం, తుళ్లిపడటం, కళ్లు తిరగటం, భ్రమ వంటివి కూడా వృద్ధుల్లో ఎక్కువ. ఇవన్నీ కూడా వాతంలో ఉండే రజోగుణ ప్రధానం వల్ల సంభవిస్తాయి. వీటికి సర్వధాతు పుష్టినిచ్చే.. అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ చూర్ణం, ముఖ్యంగా వసంత కుసుమాకరం, చ్యవనప్రాశ లేహ్యం వంటివి తీసుకుంటే కొంత వరకూ ఉపయోగం ఉంటుంది. వైద్యులను సంప్రదిస్తే లక్షణాలను బట్టి ఔషధాన్ని ఎంపిక చేసి ఇస్తారు.

వ్యాధి నిరోధక శక్తి తగ్గటం
ఆయుర్వేదం ప్రకారం రక్షణ వ్యవస్థ అంతా మన శరీరంలో ధాతువులను ఆశ్రయించుకుని ఉంటుంది. కాబట్టి ధాతువులను పెంపొందించటం ద్వారా ఈ వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందుకు: వసంత కుసుమాకరం, అశ్వగంథ చూర్ణం, అశ్వగంధ లేహ్యం, అశ్వగంధారిష్ట, చ్యవనప్రాశ లేహ్యం వంటి సర్వధాతు పుష్టికర రసాయనాలు బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం తగు మాత్రంగా పాలూ, నెయ్యీ తీసుకోవటం వల్ల కూడా ధాతు పుష్టి పెరిగి... వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

జీర్ణశక్తి
వృద్ధాప్యంలో జీర్ణాశయం కుంచించుకుని.. తీసుకునే అన్నం పరిమాణం తగ్గిపోతుంది, ఆకలీ కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఆకలి పెరిగేందుకు రోజూ అన్నం తినేటప్పుడు.. మొదటి ముద్దలో కొద్దిగా అల్లం పచ్చడి తింటే మంచిది. అల్లం, ధనియాలు, కొత్తిమీర, తక్కువ మిరపకాయలతో చేసే అల్లం పచ్చడిని రోజూ మొదటి ముద్దలో తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే సోంపు లేదా జీలకర్ర కషాయం కాచుకుని తాగితే ఆకలి, జీర్ణశక్తి రెండూ పెరుగుతాయి. జీర్ణశక్తికి జీలకర్ర ఉత్తమం. ఔషధాల్లో ఆకలి పెరిగేందుకు అగ్నితుండి వటి మాత్రలు, భాస్కర లవణం చూర్ణం, హింగ్వష్టక చూర్ణం, శివాక్షార పాచన చూర్ణం ఉపకరిస్తాయి. దాడిమాష్టక చూర్ణం ఆకలి పెంచుతుంది, విరేచనాలు కడుతుంది. జీర్ణశక్తికి జీరకాద్యరిష్టం, ఆకలికి ద్రాక్షాసవం కూడా మంచివే.


ఈనాడు వారి ఆర్టికల్