Monday, January 22, 2007

జలజల రాలే చినుకును నేను - అద్భుత కవిత

జలజల రాలే చినుకును నేను
గలగల పారే ఏరును నేను
అలలతొ పొంగే కడలిని నేను
అందరు కోరే జలమును నేను

మనుజుల కైనా మెకముల కైనా
చెట్టుల కైనా పిట్టల కైనా
దప్పిక దీర్చే జలమును నేను

భూమిని ఉన్నా మట్టిని కలసి
నింగిని ఉన్నా మబ్బులొ దాగి
మధ్యలొ ఉన్నా గాలిని గూడి
అంతట ఉన్నా ఆకృతి మార్చి
అందరు కోరే జలమును నేను

తీయటి రసముగ ఒకచోట
ఉప్పటి నీరుగ ఒకచోట
తెల్లని మంచుగ ఒకచోట
నల్లని నీటిగ ఒకచోట

స్వచ్ఛము గాను ఒకచోట
పంకిలమగుచు ఒకచోట
తేలెడి గడ్డగ ఒకచోట
రాలెడి రేకుగ ఒకచోట

ఆవిరి రూపున ఒకచోట
ఆరని తడిగా ఒకచోట
మెల్లగ సాగుచు ఒకచోట
వెల్లువ యగుచూ ఒకచోట

తిన్నగ ఉరుకుచు ఒకచోట
సన్నని గొందుల ఒకచోట
వెచ్చని ఊటగ ఒకచోట
పచ్చని నదిగా ఒకచోట

చీకటి గుహలో ఒకచోట
వెలుతురు బయలున ఒకచోట
అందని ఎత్తున ఒకచోట
క్రిందకు దుముకుచు ఒకచోట

ఉడుకుచు కుతకుత ఒకచోట
బుడబుడ పొంగుచు ఒకచోట
పరుగులు దీయుచు ఒకచోట
నిలకడగాను ఒకచోట

ఎల్లెడనుండే జలమును నేను
ఎల్లరు కోరే జలమును నేను

వానగ వచ్చి వరదగ పొంగి
పట్టగ లేని ఉరవడి తోడ
చెట్టుల రాల్చి గట్టుల ద్రుంచి
ఇళ్ళను గూల్చి ఊళ్ళను ముంచి
అల్లరి జేసి ఆరటి నిచ్చి
ఇష్టము వచ్చిన రీతిని యంతా
విహరణ జేసే జలమును నేను

అందరు కోరే జలమును నేను
ఎల్లెడనుండే జలమును నేను


ఎవరో సుప్రభ అనే ఆవిడ వ్రాసిన ఈ అద్భుత కవిత చూడండి. ఎక్కడో నెట్లో వెతుకుతుంటే కనపడింది. చాలా బావుంది. నీటి గురించి చాల చక్కగా వివరించారు. ఆవిడ మృదు మధుర కవితా ధోరణికి నమఃస్సుమాంజలి.

2 Comments:

At January 22, 2007 6:05 PM, Anonymous Anonymous said...

chaalaa maMci kavita sEkariMcaaru.

 
At January 24, 2007 3:01 PM, Blogger రాధిక said...

caalaa baagumdi.amdimcinamduku thanks

 

Post a Comment

<< Home