దర్వాజాల చారిత్రక ప్రాధాన్యమిదీ..
దర్వాజాల చారిత్రక ప్రాధాన్యమిదీ..
గోల్కొండ కోట చుట్టూ ఉన్న తొమ్మిది దర్వాజాలు వేటికదే ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి.
ఫతే(విజయం) దర్వాజా...: కుతుబ్‌షాహీలు శత్రువులపై యుద్ధానికి వెళ్లేపుడు ఈ ద్వారాన్ని ఉపయోగించే వారు. ఈ ద్వారంలోంచి వెళ్లి యుద్ధం చేస్తే తమకు విజయం చేకూరుతుందని వారి నమ్మకం. 1687లో ఔరంగాజేబు ఈ దర్వాజా గుండానే లోనికి ప్రవేశించి అబుల్ హసన్ తానేషాపై విజయం సాధించాడు. అత్యంత దుర్బేధ్యమైన ఈ దర్వాజాను ధ్వంసం చేసేందుకు ఔరంగజేబు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫలితం లేకపోవడంతో కోటలోని ఓ ద్వార పాలకుడికి లంచం ఇచ్చి ద్వారం తెరిపించి, సైన్యంతో లోపలికి ప్రవేశించి కోటను కైవసం చేసుకున్నాడని చరిత్ర చెబుతోంది.
మకాయి దర్వాజా: గోల్కొండకు పశ్చిమ దిశలో ఉంది. నాటి కుతుబ్‌షాహీరాజులు హజ్(మక్కా)యాత్రకు వెళ్లేందుకు ఈ ద్వారాన్ని ఉపయోగించేవారు. అందువల్ల దీనికి మకాయి అనే పేరొచ్చింది. మక్కాయాత్ర తప్ప ఆ ద్వారం గుండా ఎవరూ రాకపోకలు సాగించే వారు కాదు.
బౌద్లి దర్వాజా: కుతుబ్‌షాహీ వంశజుల్లో ఏడో రాజు అబుల్‌హసన్ తానేషా పాలనలో బౌద్లేషా సహబ్ సైనికాధికారిగా ఉండే వాడు. అతని పేరు మీదుగా బౌద్లిదర్వాజా అని పిలుస్తున్నారని తెలుస్తోంది.
మోతీ దర్వాజా: గోల్కొండ కోటలో వ్యాపారం చేసుకునేందుకు వచ్చే వారు వచ్చే ద్వారమిది. ప్రతి శుక్రవారం ఇక్కడ పెద్ద సంత నిర్వహించేవారు. ఇరాన్, టర్కి, తదితర దేశాల నుంచి వచ్చే వ్యాపారులు మోతీ దర్వాజా నుంచి వచ్చి వర్తకం చేసేవారు. అందుకే దీనికి మోతీ(ముత్యం) అన్న పేరు వచ్చింది.
జమాలీ దర్వాజా: కుతుబ్‌షాహీ రాజుల్లో రెండో రాజైన ఇబ్రహీం కులీకుతుబ్‌షా తన భార్య జమాలీ పేరును ఈ దర్వాజాకు పెట్టాడు.
బంజారా దర్వాజా: ఈ ద్వారం గుండా బంజారాలు, ఆదివాసీలు కోటలో పనులు నిర్వహించేందుకు వచ్చేవారు. పండ్లు, కలప తదితరాలు ఈ దర్వాజా గుండా తీసుకువచ్చేవారు.
పటాన్‌చెరు దర్వాజా: పటాన్‌చెరు ద్వారం నుంచి రైతులు తాము పండించిన పంటను కోటలోకి తెసుకువచ్చి, వస్తుమార్పిడి చేయడంతో పాటు వ్యాపారం చేసుకునేవారు. చివరి రాజైన అబుల్‌హసన్ తానీషా తన హయాంలో ఈ దర్వాజాను కారాగారంగా ఉపయోగించాడు.
బహమనీ దర్వాజా: 1363లో గోల్కొండ కోటను బహమనీ సుల్తానులు పాలించేవారు. బహమనీ వంశజుల కాలం నుంచి ఈ దర్వాజాకు బహమనీ దర్వాజా అని పేరొచ్చింది.
బాలాహిస్సార్ దర్వాజా: బాలాహిస్సార్ అంటే ఎత్త్తెన ప్రదేశం. గోల్కొండ కోటకు ఇది భద్రతకు సంబంధించిన దార్వాజా. గట్టి నిఘాతో సైనికులు కాపలా కాసేవారు. శత్రువులు అన్ని దర్వాజాలు దాటి వచ్చినా చివరిదైన ఈ దర్వాజాను దాటకుండా సైన్యం భద్రత కల్పించేది.
ఈనాడు వారి ఆర్టికల్
1 Comments:
This comment has been removed by the author.
Post a Comment
<< Home