Sunday, May 13, 2007

సుబ్బిగాడు వచ్చాడు

సుబ్బిగాడు వచ్చాడు
ఎదవ కబురు తెచ్చాడు
ఎవడు వాడు చచ్చాడు
అరుగు మీద నుంచి లేచాడు
ఒకటే పరుగు లంకించాడు

ఘుప్పు మనే ఆ కంపు

ఘుప్పు మనే ఆ కంపు
ఎవరికి అయింది ఇంపు
వినలేవా ఈ భాషా సొంపు
అసలు అయ్యిందా నీకు ఆకళింపు

Friday, May 11, 2007

హదేనంఢీ ఖవిత్వం - అర్ధం చేసుకోరూ !

మా సాంబు గాడు కపిత్వంలో - హదేనంఢీ ఖవిత్వం - అర్ధం చేసుకోరూ - కొంచెం వేలెట్టి ఈ మధ్య ఈ హాస్యస్ఫోరకమయిన పద్యం రాసాడు. నచ్చిన వాళ్ళు నవ్వుకోండి. నవ్వ లేని వాళ్ళు మళ్ళీ ఇక్కడకు రాకండి..

పణతీ ఓ పణతీ
కోతి లాంటి ఓ పణతీ
ఎక్కడ పోయిందో ఆ భీతి
తుంగలో తొక్కావా కుటుంబ రీతి
కాలరాసావా సకల నీతి
మరిచిపోయావా మనుషుల మిరుమిత్తి
పంచుకుని పెంచాలనుకున్నా ప్రీతి
రాయలసీమ రాకాసి వయ్యావీ రీతి
పణతీ ఓ పణతీ
కోతి లాంటి ఓ పణతీ

పణతీ ఓ పణతీ
ఎంత వికారమయిన రూపం
రూపానికి నప్పే కోపం
ఏమయ్యిందో పాపం
ఎందుకంత కోపం
తగ్గదా నీ తాపం
వెయ్యనా చాపం
ఎక్కడ ఉంది లోపం
పణతీ ఓ పణతీ
కోతి లాంటి ఓ పణతీ

పెళ్ళి ఏడుపులు - పెళ్ళి వస్తువులు

పెళ్ళి ఏడుపులు - పెళ్ళి వస్తువులు


ఇది ఇన్ని రోజుల నుండి నా కంట్లో ఎందుకు పడలేదు అబ్బా ? చాలా రోజుల నుండి ఉన్నట్టు లింకును (అక్టోబరు)బట్టి తెలుస్తోంది. ఏదేమయితేనేం రాఘవాచార్యులు గారు కవిత్వాన్ని పిండి ఆరబోశారు, అదర గొట్టారు..


వంశీ గారికి ధన్యవాదాలతో



పెళ్ళి ఏడుపులు - పెళ్ళి వస్తువులు

Friday, May 04, 2007

సణుగుడు మేళమా ?




వంశీ గారూ అదర గొట్టారు కథ. తరువాతి భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ.


ఇదే కథ మళ్ళీ ఇక్కడ కూడ చూడవచ్చు





సణుగుడు మేళమా ?


ఏమేవ్ పార్వతీ! ఎక్కడ ఉన్నావ్! ఇది కొంపా, శనివారం సంతా. ఒక్కటి కూడా కనపడి చావదేమే, ఎక్కడ పెట్టింది అక్కడ ఉంచకుండా ఈ తాడేపూడి తద్దినాలు ఏంటి నాకు..ఇంకోసారి నా వస్తువులు ముట్టుకున్నారో చమడాలు వలిచి పారేస్తాను. దరిద్రమానీ - దరిద్రం.


ఒరే బుజ్జిగా - నిన్ను తగలెయ్య. స్కూలుకు తయారు అవరా అంటే ఆ వెధవ దిక్కుమాలిన టీ.వీ చూస్తూ కూర్చున్నావ్..అసలు హోం వర్క్ చేసి చచ్చావా? ఆ పంతులు గారికి నేనే వచ్చి చెపుతా "వీపు మీద విరివిగా బెత్తంతో బాది పారెయ్యమని". అప్పుడు గానీ బుద్ధి కుదురుకోదు వెధవన్నర వెధవా..ఎన్ని సారులు చెప్పాలిరా నీకు -ఆ వెధవన్నర వెధవ, ఆ సత్రకాయ సుబ్బారావు గాడి కొడుకుని చూసి బుద్ధి నేర్చుకోమని, వాడి లాగా చక్కగా చదువుకుని ఫస్టు రాంకు తెచ్చుకుందామని ఎప్పుడు ఉంటుంది రా నీకు.ఎన్ని సార్లు చెప్పు - ఆ దేభ్యం మొహం వేసుకుని చూడటం తప్పితే ఒక ఉలుకు పలుకూ ఉందా.అసలు నాదీ బుద్ధి తక్కువ, నీతో మాట్లడటం.


ఒసేవ్ - ఎక్కడ తగలడ్డావు? అరగంట అయ్యింది లేచి - కొంచెం కాఫీలు, ఫలహారం నా మొహాన తగలేద్దాము అని ఏమన్నా ఉన్నదా ...అసలు ఏం చేస్తుంటావే ఆ వంట గదిలో అంతంత సేపు. చేసే ఆ దిక్కుమాలిన వంటకి ఆ వడలిపోయిన కూరగాయలతొ, వన్నె తగ్గిన వంట పాత్రలతో మూడు గంటలు ముచ్చట్లు. పైనుంచి తెగ అలసిపోయినట్టు హస్షో హుస్షో అనుకుంటూ బయటికి రావటం. ఖర్మే ఖర్మ.


అహా....అసలు అయినా నాకు మంచి వంట తినే ప్రాప్తం ఉండొద్దూ. ఈ పదార్ధాన్ని ఏమంటారు పార్వతిగారూ.. ఏమిటీ? ఉప్మానా, అబ్బో దస్తావేజులు బొత్తులు బొత్తులుగా ఈ జిగురు పదార్ధంతో అతికించుకోవచ్చు.. అసలు అయినా మీ అమ్మను అనాలి, నా ముద్దుల ఒక్కగానొక్క కూతురు ఎక్కడ అలిసిపోతుందో అని వంట, పెంట నేర్పించకుండా, పెళ్ళి చూపులకి వెళ్ళినప్పుడు - అహా మా అమ్మాయి వంట ముందు నల భీములు పనికి రారు అని డబ్బా కొట్టి ఊదర గొట్టారు. పైగా ఫలహారాలు అయ్యాక ఈ సున్నుండలు మా అమ్మాయి చేసినవే అని ఆ రామావతారం గాడి కొట్లోనుంచి తెచ్చిన సరుకు నా నోట్లో కుక్కి, నాకు నిన్ను తగలేశారు. సరేలే యే జన్మలో యే పాపం చెసుకున్నానో, మంచి వంట తినె ప్రాప్తం లేదు...


"ఒరే పరంధామం - ఎందుకురా అస్తమానూ ఎప్పుడూ అలా ఏదో ఒకటి సణుగుతూ ఉంటావు? నువ్వు ప్రశాంతంగా బతకవు, పక్కల మనుషుల్ని ప్రశాంతంగా బతకనివ్వవు. ఎందుకురా ఇలా తయారు అవుతున్నావు. వయసు వచ్చే కొద్దీ పెడసరం మాటలు ఎక్కువ అవుతున్నాయి నీకు. తగ్గించుకోరా..."


ఊరుకో నాన్నా..నువ్వు బయటపడట్లేదు, నేను బయటపడుతున్నా అంతే తేడా....సరేలే నేను సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఆ దగ్గు మందు తెస్తా. అందాకా ఆ పాలల్లో, మిరియాల పొడి వేస్కుని ఆర ఆరగ తాగుతూ ఉండు. సరే మరి నే వెళ్ళొస్తా.


అవునుగానీ లక్ష్మీ - ఆ శ్యామలరావు వాళ్ళ అబ్బాయి అవేవో సంగీతం పాఠాలు చెప్పడం మొదలెట్టాడుట. ఆ వివరాలు కనుక్కుని చెప్పు నాకు.సాయంత్రం వెళ్ళి శ్యామలరావుతొ మాట్లాడి వస్తా. చేరుదువు కానీ - ఈసారన్నా నాయనమ్మ కోరిక ప్రకారం ఆ సంగీత శిరోమణి పరీక్ష ప్యాసు అయ్యి ఆవిడ మనస్సుకి కొంచెం శాంతి కలిగించవే...


పార్వతీ - తలుపు గడెట్టుకో. అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ మధ్య. ఆ గ్యాసు బండ వాడు వస్తే వాడిని ఆ వసారాలో తగలేసి పొమ్మను. లోపలికి రానివ్వబోకు. ఆ బండ నీ నెత్తి మీద వేసి ఆ వారా నగలు ఎత్తుకుపోగల...జాగ్రత్త....


ఈ వెధవ రామ్మూర్తి పీనుగ ఏమంటాడో ఏమిటో , అరగంట లేటుగా వెళ్తున్నాను ఆఫీసుకి. ఏదో ఒక దిక్కుమాలిన కారణం వెతుక్కుని చావాలి ఇప్పుడు.ఈ ఆఫీసులోకి వీడు మానేజరుగా వచ్చినప్పటినుంచి సంత క్షవరం లాగా అందరి తలలు నున్నగా చెక్కి పారేస్తున్నాడు,అక్షింతల కత్తెరతో వెధవ పీనుగ. సుఖంగా ఒక కాఫీ తాగనివ్వడు, ఒక హస్కు వేసుకోనివ్వడు అదేం రోగమో వీడికి.


సరే ఇవ్వాళ్ళన్నా ఆఫిసుకు వెళ్ళాక ఆ సుబ్బారావు గాడిని డబ్బులు అడగాలి. బట్టబుర్ర వెధవ, ఎప్పుడు చూడు ఈసురో మంటూ ఉంటాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వరా అంటే ఆ బుర్ర గోక్కుంటూ, ముక్కులో వేళ్ళు తిప్పుకుంటూ, ఆ పార పళ్ళు బయటపెట్టి "ఇదిగో రేపు ఇచ్చేస్తా అన్నయ్యా, ఈ సారి తప్పకుండా నా మాట నమ్ము" అని ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు. ఇవ్వాళ్ళ ఊరుకోకూడదు. సంగతి అటో ఇటో తేల్చి పడెయ్యాలి.

టికెట్...టికెట్...


ఇదిగో బాబూ కోనేరు సెంటరు కి ఒకటి కొట్టు...


ఇదిగో బాబూ కొంచెం తప్పుకుంటావా, నేను దిగాలి....ఓయ్ ఓయ్...ఆగవయ్యా ఇక్కడ జనాలు దిగాలేదు పెట్టాలేదు, బుర్రున తోలిపారెయ్యడమేనా. ఎవడన్నా ఆ చక్రాల కింద పడితే ఏమవును. బుద్ధుందా అసలు నీకు, ఎవడిచ్చాడయ్యా అసలు నీకు లైసెన్సు...


దిగండి మాష్టారు , అనవసరమయిన మాటలు ఎందుకు...రైట్...రైట్


హూన్ ....సరే ఇప్పుడు ఈ మూడు అంతస్థుల మెట్లు ఎక్కాలా ఇప్పుడు. ఈ బస్సుల్లో ప్రయాణం ఏమిటో, ఈ ఆఫీసు గొడవలేమిటో. దిక్కుమాలిన జీవితమాని దిక్కుమాలిన జీవితం.


ఏరా పరంధామం ఏమిటి సంగతి? ఇవ్వాళ్ళ ఆలశ్యంగా వచ్చినట్టున్నావు ఆఫీసుకి...అంతా కుశలమేనా ....


ఆం...కుశలం కాకపోతే, నారాయణ నారాయణ అంటూ నీ పేరు జపిస్తూ మంచంలో తీసుకుంటూ పడి ఉండమన్నావా ఏమిటి? వెధవ ప్రశ్నాని వెధవ ప్రశ్న.. ఆం...అయినా బాధలు ఉంటే మటుకు ఎవడు తీర్చొచ్చాడులే...సరే కానీ ఆ రామ్మూర్తి వచ్చాడా ? చూసావా ?


నిన్ను ఏదన్నా అడగటం తప్పురా పరంధామం, ఉరుము ఉరుమి మంగలం మీద పడ్డట్టు, నా మీద పడతావు ఏమిరా.....ఏదో చిన్ననాటి స్నేహితుడివి కదా అని ఊరుకుంటున్నా...సరే ఇక నుంచి నీ బాధలు చెప్పొద్దు, నీ సుఖాలు నాకు చెప్పొద్దు. ఆ రామ్మూర్తి గాడు ఇవ్వాళ్ళ మధ్యాహ్నం నుంచి వస్తాడుట, ఇందాకే కబురు పెట్టాడు.


హమ్మయ్య...ఒక పీడ విరగడ అయ్యింది - సగం రోజన్నా సంతోషంగా ఉండొచ్చు... సరే కానీ..ఒక విషయం చెప్పు నాకు
సశేషం...