400 ఏళ్లనాడే భారత్లో నానోటెక్నాలజీ!
మతయుద్ధాల్లో కత్తులకు భారత్ నుంచే ఇనుము
400 ఏళ్లనాడే నానోటెక్నాలజీ!
హాంబర్గ్: శతాబ్దాల కిందట క్రైస్తవ రాజులపై ముస్లిమ్‌లు సాగించిన మత యుద్ధాల్లో వాడిన కత్తుల కోసం ఇనుమును భారత్ నుంచి తీసుకొచ్చారని జర్మనీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందులో ఓ రకమైన నానో టెక్నాలజీని వినియోగించారని వారు పేర్కొన్నారు. ఈ కత్తులు అత్యంత పదును కలిగి ఉంటాయి. పురాతన కాలంలో భారత్‌లో వాడే వూజ్ అనే ఇనుప ముద్దల ద్వారా వీటిని తయారుచేసినట్లు చెప్పారు. అత్యాధునిక పద్ధతుల్లో ముడి ఇనుమును శుద్ధి చేసి దీన్ని రూపొందించారని జర్మన్ పరిశోధకులు వివరించారు. అయితే ఈ ప్రక్రియ తాలుకు రహస్యాలు 18 శతాబ్దంలోనే గల్లంతయ్యాయి. యూరప్‌కు చెందిన నిపుణులు ఇప్పుడు వీటిని తిరిగి తయారుచేయలేకపోతున్నారు. అప్పట్లోనే కంసాలీలు ఇంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడంలేదు. ఇందుకోసం వారు పరిశోధనలు జరుపుతున్నారు. 17వ శతాబ్దం నాటి ఒక కత్తిని పరిశీలించిన శాస్త్రవేత్తలు కార్బన్ నానో ట్యూబ్‌ల ఆచూకీని పసిగట్టారు. అంటే నాలుగొందల ఏళ్ల కిందటే నానో టెక్నాలజీ అప్పటి చేతివృత్తుల వారి అందుబాటులో ఉందని డ్రెస్డెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ పాఫ్లర్ చెప్పారు.
Courtesy: EENADU