వితండ వాదములు - చమత్కారాలు
నాకు ఊహ తెలిసినప్పటినుంచి జరిగిన వాదవివాదాలు,వాటిలో చమత్కారాలు, చెణుకులు గురించి వ్రాద్దాము అని ఒక చిన్ని ఊహ మొదలు అయ్యి ఈ రూపాన్ని సంతరించుకుంది. ఇందులో ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు. కొంతమందికి ఇవి హాస్యంగా ఉండవచ్చు, మరి కొంతమందికి కోపం తెప్పించవచ్చు , కాని మనసులో ఉన్నది బయటికి తీసుకువచ్చే ప్రయత్నం మొదలుపెట్టాను. ఎవరి మనసు అయినా నొప్పిస్తే క్షమించండి.
ఈ వాద వివాదాలు అనేవి కుటుంబ సభ్యులతొ కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ఇతరులతో కానివ్వండి -
వితండవాదం అనే రూపు ఎప్పుదు సంతరించుకుంటాయి ? ప్రతిపక్షాన్ని వెక్కిరించడము లేదా హేళణ చెయ్యడం అనేది ప్రధానోద్దేశ్యంగా పెట్టుకుంటే అప్పుడు దాన్ని వితండ వాదం అంటాం.
అసలు వాదాలు ఎందుకు వస్తాయి ? ఒక సంభాషణ మొదలు అయినప్పుడు వాదప్రతివాదాలు సహజంగా ఉంటవి -రైలులో ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి , క్లబ్బులలో సమావేశమయినప్పుడు కానివ్వండి మరి ఎక్కడ అయినా కానివ్వండి మనం తోటి వారితో సంభాషణ చేయవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది. ఆ సందర్భాలలో ఏదో ఒక చర్చలోకి దిగడమూ జరుగుతుంది, అది సహజం. అసలు ఆ చర్చ ఎలా జరుగుతోందో చూస్తే - "హయ్యో!! వీళ్ళు అనవసరంగా వాగ్యుద్ధంలోకి దిగారే - అసలు దోషము ఈ విధంగా మాట్లాడడంలో ఉన్నది. అది వీళ్ళకి తెలిస్తే బాగుండు" అని అనిపిస్తూ ఉంటుంది.
బయటే కాకుండా ఇంట్లో ఆడవాళ్ళు కూడ మనతో వాదిస్తున్నప్పుడు , ఆ వాదన ఒక్కొక్కప్పుడు అసమంజసంగా, అసంబద్ధంగా ఉంటూ ఉండడం మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చూసినవాళ్ళమే. అలాగని మన మగవాళ్ళు ఏదో పెద్ద గొప్ప అని కాదు. మనల్ని మనం విమర్శించుకోగలిగితే మనం ఆడవాళ్ళని ఎన్నోసార్లు డబాయిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అందరం తెలిసి ఒకప్పుడు, తెలియక ఒకప్పుడు మొండిగా వాదిస్తూ ఉంటాము. అదీ సంగతి. కాని ఈ వాదాలు నడిచే నడకలు ఉంటాయి చూడండి, అవి బహు ఆనందంగా ఉంటాయి. వాదం చేసేటప్పుడు ఇవి అన్నీ గుర్తుకు రావు..తర్వాత ఎప్పుడు అన్నా తీరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే , ఆహా - ఓహో అని నవ్వు కలుగుతూ ఉంటుంది.
ఏవండీ..రెండు కాళ్ళమీద నడిస్తే వింత, వైపరీత్యం ఏముంది ? తలకిందులుగా నడిస్తేనే నవ్వు వస్తుంది..ఈ వాదాల సంగతీ అంతే.
సరే ఇక ఉపోద్ఘాతం ఆపి నా వాదవివాదాల ఆలోచనలకి, జ్ఞాపకాలకి రూపం ఇవ్వటం మొదలు పెడతాను.
నాకుగా బాగా గుర్తు ఉండి బాగ నవ్వు తెప్పించేవి మొట్టమొదటిగా మా మేనమామ కృష్ణ శర్మ గారు మాతో కాని, అమ్మమ్మగారింటికి వచ్చే వారితో కాని చేసే సంభాషణలు. ఆయన భలే సంభాషణా చతురుడు...ఆ మాటకొస్తే మా మేనమామలు అందరూ అద్భుతమయిన సంభాషణా చాతుర్యం కలవారు. అసలు వారితో కూర్చుంటే కాలం తెలీదు అని చెప్పొచ్చు. సరే ఇక శర్మ గారి వద్దకి వస్తే, అసలు ఆయన్ని సంభాషణలో ఓడించటం చాలా కష్టం, కాని ఆయన మొదలుగా తన వాదం ఎప్పుడు అన్నా జారిపోతోంది అని తోచినప్పుడు - ఏదో ఒక శాస్త్రంలోనుంచి ఒక శ్లోకాన్ని ఉదహరించి "శాస్త్రం అలాగ ఉందండి. నీవు చెపితే ఏం లాభం, ధర్మశాస్త్రాన్ని కాదనలేవు కదా ! కాబట్టి ఇక మాట్లాడక ఊరుకో, నీ వాదన నిలువదు" అని డబాయిస్తూ - ఎదుటివాడి వంక చూసే చూపులోనే ' ఇంతమాత్రము తెలియదా. హయ్యో , ఎంత అజ్ఞానంలో ఉన్నావు" అన్న భావన ఉట్టిపడుతూ ఉండి ఆ చూపు తీక్షణతకే ఎదుటివాడి ఉక్కు అణిగిపోYఎవిధంగా ఉంటుంది. ఆ చూపులకు తోడు తిరస్కారభావసూచకమయిన చిరునవ్వు, దానికి తగ్గట్టుగా హస్త విన్యాసములు కూడా ఉండి, ఇంక మనం ఆ సంభాషణకి సెలవు పలుకుతాము అన్న మాట. ఈ రకమయిన ఆయన విన్యాసాలు వాదాలకు మాత్రమే పరిమితం. అలాగని ఆయన ఎప్పుడూ దబాయిస్తూ ఉంటారు అని కాదు. చాలా చాల చాలా మంచి మనసున్న వ్యక్తి. అడిగినవాళ్ళకి అదీ ఇదీ అని లేకుండా ఏది కావాలి అన్నా చేసిపెడతారు.
ఆయన సంభాషణా చాతుర్యానికి ఒక్క చిన్న ఉదాహరణ - నాకు బాగా గుర్తు ఉన్న సంభాషణ ఇది - మా ఊర్లో ఒకాయన , పేరు ఎందుకులెండి మా మావయ్యగారితో "శాకాహారం మంచిదా ? మాంసాహారం మంచిదా" అనే విషయం మీద సంభాషణ మొదలు పెట్టి తన వాదనే నిలవాలి అనే పట్టుదలకి వచ్చి వితండ వాదం మొదలు పెట్టాడు. చెప్పాను కదా మా మావయ్యగారికి అలాంటివి పడవు అని..అప్పుడు చివరగా ఒక్కటే మాట , తన హస్తవిన్యాసం చూపుతూ తిరస్కార భావ చిరునవ్వుతో అన్నారు - " ఏమిటయ్యా నువ్వు అనడము ? శాకాహారం మాని మాంసాహారం తినమంటావా ? ప్రకృతి లో తోడేళ్ళు, నక్కలు మొదలయినవి మాంసం తినే ప్రాణులు. అచ్చంగా మాంసాహారం తింటే మనంకూడా నక్కల్లాగా తయారు అవుతాము. కాకపోతే తోడేళ్ళతో సమానము అవుతాము, చెప్పు నీకు తోడేలు లాగ ,నక్క లాగా బ్రతకాలి అని ఉంటే మాకేం అభ్యంతరం లేదు" అని - దాంతో అందరూ గొల్లున నవ్వారు , పాపం ఆయన గాలి తీసేసినట్టు అయిపోయి శర్మగారు క్షమించండి అని చక్కా పోయాడు.
ఇంకొక చెణుకు మా మావయ్యగారి సంభాషణనుంచి - మా పిన్ని కొడుకు శేషగిరి ఒకరోజు ఎందుకో ఏదో మాటల్లో ఇంగ్లీషు వారు కూడా ఆర్యజాతివారు అని అన్నాడు. ఇక మా మావయ్యగారు అందుకున్నారు ఇలా " ఏరా శేషయ్యా..ఇంగ్లీషు వాళ్ళు, ఆర్యులు ఒక జాతి వారా !! అంటే ఈ పరాసువాళ్ళు, బుడతకీచులు వీళ్ళు అంతా ఆర్యులే అన్న మాట. భలే సంగతి చెప్పావురా !! (ఇక్కడ హస్తవిన్యాస ప్రయోగం మొదలు అయ్యింది!!) అంటే రుష్యశ్రుంగుడు, రోశయ్యా ఒకటే ! అదేగా నీవు అనడము ? ఇంత ఎందుకు - అగస్త్యమహా ౠషి , మన ఆర్ముగంశెట్టి ఒకటేనంటావు..బాగుందిరా అబ్బాయి..నీ వాదము బాగుంది" అని ఎడా పెడా హాస్యాస్పద ధోరణిలో మాట్లాడుతూ ఉంటే మా శేషగిరి నిరుత్తరుడయి నిలబడి ' మావయ్యా నీకో దణ్ణం నన్ను వదిలిపెట్టు" అని పోయాడు..
ఇలాంటివి చాలా ఉన్నాయి..నెమ్మదిగా ఒకటొకటి త్వరలో ...