దేవాంగుల వేషం - ఏకపాత్రాభినయం
సాధారణంగా మనం ఏదన్నా జానపదులు వేసే నాటకాలు చూడటానికి వెళ్ళి ఇంటికి వచ్చాక ఆ నాటకాల్లోని హాస్య పాత్రధారులని తలుచుకుని నవ్వుకునే సన్నివేశాలు చాలా ఉంటాయి. అందులో మనసుకి హత్తుకుని పోయే వారి మాటలు, వారి వాక్ప్రవాహ మహిమ, అసాధారణ చాతుర్యం, నటన, హావభావాలు ఇలా ఎన్నో మన మనసు మూలల్లో దాక్కుని, అప్పుడప్పుడూ బయటికి వచ్చి మనలని హాయిగా నవ్వుకోమని ఆ పూటకి హాస్యభోజనం వడ్డించి వెళ్ళిపోతూ ఉంటాయి.అలా నా మనసుకి బాగా నచ్చిన హాస్య పాత్రధారి వేషాల్లో దేవాంగుల వేషం ఒకటి. ఈ వేషం సాధారణంగా గోదావరి జిల్లాల్లో ప్రదర్శించబడే జానపద నాటకాలలో విశేషంగా కనపడుతూ ఉంటుంది. మా బంధువులు గోదావరి జిల్లాలోని మండపేటలో ఉండేవాళ్ళు. అలా నేను ఎప్పుడన్నా సెలవలకి మండపేట వెళుతూ ఉండేవాడిని. అలా వెళ్ళినప్పుడు చూసిన జానపద నాటకాలలో ఈ దేవాంగుల హాస్య వేషం నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి.
తలకి రుమాలు చుట్టుకుని, ముఖాన పెద్ద పెద్ద వీభూతి రేఖలు ధరించి, భుజాన చిన్న బట్టల మూట, ఒక చేతిలో బారెడు పొడవున్న ఒక చెక్క బద్ద పట్టుకుని వచ్చి తన వృత్తి గురించి, తన వివరాల గురించి నానా రకాలుగా అభినయిస్తూ ఏకధాటిగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడే వేషధారి ఈ దేవాంగి వేషధారి.
నాకు గుర్తు ఉన్నంత మటుకు అతని హావభావాలు , మాటల్లో కొన్ని ఈ మధ్య గోదావరి జిల్లా జానపదకళారూపాలు అనే పుస్తకం చదువుతుంటే అందులో కనపడ్డాయి. భలే సంతోషం వేసింది - మళ్ళీ నా జ్ఞాపకాల దొంతరల తుట్టెను కదిల్చి మధురమయిన ఆనందం కలిగించింది ఆ పుస్తకం.
అందులో కొన్ని మాటలు - రచయిత గారి అనుమతి తీసుకోకుండా ఇక్కడ ప్రచురిస్తున్నాను. అందుకు వారు క్షమిస్తారు అని ఆశిస్తూ - అభ్యంతరం ఉంటే తెలియచెయ్యమని కోరుకుంటూ - ఇక చదువుకోండి
ముందే జెపుతున్నాండి ఇది ద్వందార్ధాల సంభాషణండి - మీకు అలాంటివి నచ్చకపోతే చక్కగ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తొంగోండి , అంతే కానీ దిక్కుమాలిని తిరుగు రాతలు(కామెంట్లు) రాయొద్దు అని మనవండి.ఇది నా స్వంత రాతలు కావని - పుస్తకములో అచ్చు వేసిన ముద్రాక్షరాలు అని మనవండి.."పెరిగింది పెద్దాపురవండి, ఉనికి ఉప్పాడండి - కాపరం దోనేపూడి అండి. ఇక నా పనితనం చెప్పమంటారాండి? ఓసారి సొంతంగా నేనే నేసేనండి కాశ్మీరు శాలువా. కాకినాడ పట్టుకెళ్ళేనండి - క్ళ్ళు జిగేల్మని సూడలేకపోయారండి. ఏలూరు పట్టుకెళ్ళానండి - ఇలువు లేదన్నారండి. అంటే అది నాసి రకం అని కాదు సుమండీ - దాని పనితనానికి ఖరీదు కట్టలేవని. నా ఎదురు నేతలో ఉందండి నా మజాకా. గుంటకాడకూకుంటే బట్టయ్యేదాకా లెగనండి. ఇప్పుడు సీమపోగునూలొచ్చిందగ్గరనుంచీ పలక మీద దట్టింపు పోయిందండి. అందుకని బాబయ్యా! మాయింట గొయ్యి మాతమ్ముడికొప్పజెప్పేసి ఊళ్లమీదికి లంకించుకున్నానండి బట్టలేపారానికి. బాబయ్యా! మాయింటి గొయ్యంటే ఏదన్నా అనుకునేరు - మగ్గం గొయ్యండి . ఇలా ఊళ్లమీద పడి లంకించుకుంటుంటే పంచిల్లో మాలావుగా వొచ్చిందండి. ఆ పంచిల్లో వొచ్చింది చీరల్లో దూరిందండి.దాన్ని కూడదీసుకోడానికి మళ్ళీ జాకెట్టుల్లో లాగాల్సోచ్చిందండి.
ఈ బట్టలమ్మకాల్లో ఓరోజు బిక్కోల్లోపొద్దోయిందండి. ఉండిపోదావా అనుకున్నానండి - నాకక్కడో కాతా ఉందిలెండి. చీరలు జాకెట్లూ నేనే యిత్తానండి ఆరికి వతనగా. తీరా ఎల్తే ఆవిడ ఆళ్ళ బావగారొచ్చారు కాళీలేదందండి. ఆవిడిది ఒక్కటే గదండి. మరింకేం జెయ్యును? అర్ధరాత్రి బయల్దేరి పెద్దకత్తి మొల్లో దోపుకుని దోనేపూడి బయల్దేరానండి యింటికి.
అసలే అది అర్ధరాత్రి, చూస్తే దొంగలరోడ్డు.ఆ పైన సిమ్మసీకటి. అనపర్తి దాటాక ఒక దొంగ తలకి తెల్లటి గుడ్డ సుట్టుకునిదారిపక్కన కాసుక్కూసున్నాడండి ఎవడొత్తాడా అని - అప్పుడేంజేసేనంటే బట్టలమూటపక్కనెట్టి ఎనకమాలుగా ఎల్లి కత్తితో తలమీదొక్క ఏటేశానండి. దెబ్బకి రెండు ముక్కలయ్యిందండి. ఏవిటీ? కత్తి!. కత్తి రెండుముక్కలవ్వడేమిటనుకుంటున్నారా? అది మనిషయితేగా! మైలు రాయండి. అదండీ నా బట్ట ల యాపరం కతా కమామీషు.
ఇంకో ఇషయమండి. దేవతలకి మేము అంగోత్రమిచ్చావండి. అందుకే మమ్మల్ని దేవాంగులన్నారండి. మా కులం భలే కులవండి. కొంచెం ఈ మద్దే మెతకతనం వచ్చిందనుకోండి. మొగోళ్ళేమో తాగుబోతులయిపోతున్నారండి - ఆడోళ్ళేమో బాబయ్యా ఏరు పిడకలకెళ్ళి ఎత్తి పెట్టించుకున్నారండి - మరేం లేదు బాబయ్యా తట్ట నెత్తిమీదికండి"
ఇలా ద్వందార్ధాలు వచ్చేలా మాట్లాడుతూ ఉంటే జనం పగలబడి నవ్వుతూ ఉండేవారు. అదండీ సంగతి.