Tuesday, December 26, 2006

మాతృభాషపై మనవారి మమత తగ్గి

మాతృభాషపై మనవారి మమత తగ్గి
పరుల బాస పై యెందుకో పెరిగే ప్రేమ
అల్లరుచిమెండు పొరిగింటి పుల్లకూర
ఇంటి యిల్లాలి వంటకంబింపు కాదు

అమ్మ నాన్నయను పిలుపులాయె వెగటు

ఎక్కడో ఎప్పుడో చదివినట్టు ఉంది...ఎస్.కే పిళ్ళై అనే ఆయన అనుకుంటాను , ఈ పద్యాలు రాసినట్టు గుర్తు...ఖచ్చితం కాదు గానీ అనుకుంటున్నా...చాలా రోజులకి గుర్తు వచ్చింది


అమ్మ నాన్నయను పిలుపులాయె వెగటు
మమ్మి డాడి యనంగనే మధురమాయె
అత్త మామాయనే మాట లుత్తవయ్యె
ఆంటి అంకుళ్ళు నేటి స్టైళ్ళాయె

Wednesday, December 20, 2006

అల్లసాని వారి వచనం చూడంది ఎంత హృద్యంగా ఉందో - Part 2

ధర కెంధూళులు కృష్ణరాయల చమూధాటీ గతిన్‌ వింధ్య గ
హ్వరముల్‌ దూరగ జూచి, తా రచట కాపై యుండుటన్‌ చాల న
చ్చెరువై యెర్రని వింత చీకటులు వచ్చెం జూడరే యంచు వే
సొరిదిం జూతురు వీరరుద్ర గజరా ట్శుద్ధాంత ముగ్ధాంగనల్‌

అభిరతి కృష్ణరాయడు జయాంకములన్‌ లిఖియించి తాళ స
న్నిభముగ పొట్టునూరి కడ నిల్పిన కంబము సింహ భూధర
ప్రభు తిరునాళ్ళకున్‌ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభు నపకీర్తి కజ్జలము వేమరు బెట్టి పఠించు నిచ్చలున్‌

అల్లసాని వారి వచనం చూడంది ఎంత హృద్యంగా ఉందో

అల ప్రోతిప్రభు దంష్ట్ర, భోగివర భోగాగ్రాళి రా, లుద్భటా
చల కూటోపల కోటి రూపు చెడ నిచ్చల్‌ రాయగా నైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరస క్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహా మృగనాభి సంకుమద సాంద్రాలేప పంకంబునన్‌

క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తి బొ
ల్పారు మిడుంగురుంబురువు లంచు వెసన్‌ గొనిపోయి పొంత శృం
గార వన ద్రుమాళి గిజిగాడులు గూడుల జేర్చు దీపికల్‌
గా రహి కృష్ణరాయ మహికాంతుని శాత్రవ పట్టనంబులన్‌

Tuesday, December 19, 2006

మన విలువలు పడిపోవటానికి కారణం ఏమిటి ?

A monthly periodical called 'Just Another Magazine (JAM)', a picture of lord Shiva has been used for creating awareness among people about AIDS. On the last page of this periodical, there is a picture of a Lord Shiva under which it is written that 'Khada hai to Condom hai.'

Members of Hindu Janajagruti Samiti (HJS) held demonstrations outside the Head Office of 'JAM" for denigrating Lord Shiva.

See the images of mocking advertisement and protests at -


మన విలువలు పడిపోవటానికి కారణం ఏమిటి ?

Saturday, December 16, 2006

పార్వతీశ్వర కవుల "బొంగర" కవితా సౌరభము

పార్వతీశ్వర కవుల వారు విరజిమ్మిన "బొంగర" కవితా సౌరభము

రింగు రింగున తిరుగు నా బొంగరంబు
యేమియో వ్రాయుచున్నది ఇసుకలోన
బడికి పోలేదు పొత్తంబు పట్టలేదు
యెట్లు వచ్చినదో దీనికింత చదువు..

బొంగరం ఆట గురించి చెప్పిన ఈ పద్యం ఎంత హాస్యస్ఫోరకంగా ఉందో చూడండి

ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా...

ఎక్కడ చదివానో, విన్నానో గుర్తు లేదు కానీ గబుక్కున ఎందుకో జ్ఞాపకం వచ్చింది. గుర్తు ఉన్నంతవరకు రాసాను. అచ్చంగా ఇలాగే ఉండేదో లేక నేను ఏమన్నా తప్పులు రాసానో తెలిదు కానీ, చదువుకుని ఆనందించండి.

ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ!!
కల్లూ తాగీనోళ్ళు
కైలాస మెల్తారంట
సారా తాగినోళ్ళు
సర్గ మెల్తారంట!
ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ!!
కడుపూ సందరమైతె
కాలవ సారాయైతె
పడుతూ లేత్తూ తాగి
బాగా కై పెక్కాలి
ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ!!

వేళ్ళు - చెయ్యి - దేముడు

చిటికిన వేలు సింగారం
ఉంగరపు వేలు బంగారం
నడిమి వేలు నాన్న
చూపుడు వేలు నీకేసి
బొటన వేలు బొట్టేట్టి
ఐదు వేళ్ళా అరచెయ్యి
అరచెయ్యి అరచెయ్యి అంటింఛి
దేముడికి దణ్ణం పెట్టు.

లలిత సుగుణజాల తెలుగుబాల

" తెలుగు శతకంలో ఉన్న ఒక పద్యం "

ఎద్దునెక్కెను శివుడు గద్ద నెక్కెను విష్ణు
హంసనెక్కె పంకజాసనుండు
బద్ధకంపు మొద్దు బల్లపైనెక్కెరా
లలిత సుగుణజాల తెలుగుబాల

ఎంతగానో గర్వించదగ్గ దేశాభిమానం - మహామనీషి

బిస్మిల్లాహ్ ఖాన్ గారి గురించి ప్రజాసాహితిలో వచ్చిన పద్యాన్ని కింద ప్రచురించిన తరువాత, నా మనస్సుకి హత్తుకుపోయిన మణిపూస లాంటి ఆయన మాట ఒకటి చెప్పాలి అనిపించింది.అది తలచుకున్నప్పుడల్లా మనసు పులకరించిపోతుందండి నాకు. అంతటి వెల లేని వజ్రాన్ని కన్న తలిదండ్రులు, మన దేశంలో పుట్టినందుకు మనము ఎంతగానో గర్వించదగ్గ విషయం.

ఆయన ఒకసారి విదేశాలలో కచేరీ చేస్తున్నప్పుడు, ఒకాయన ఆయనని అడిగాడు అట "ఏవండీ మీరూ భారతదేశంలో ఎందుకు, చక్కగా ఇక్కడికి వచ్చెయ్యండి. మా దేశంలో ఉండిపోదురు గానీ - మీకు బోలెడన్ని సన్మానాలు, పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తాము మా దేశం తరఫునుంచి".

అప్పుడు బిస్మిల్లాహ్ ఖాన్ గారు ఏమన్నారో తెలుసా ?

"నాకు ఈ దేశానికి వచ్చి ఉండటానికి అభ్యంతరం లేదు కానీ, ఒక్కటే షరతు..నా తల్లి గంగా నదిని, నా దైవం కాశీ విశ్వనాథుడిని మీ దేశానికి తీసుకుని రండి. అప్పుడు ఆనందంగా వారి సన్నిధిలో మీ దేశంలోనే నా శేష జీవితం గడుపుతాను" అని.

బిస్మిల్లాహ్ ఖాన్ గారిని అలా అడిగిన పెద్దమనిషి మొఖంలో నెత్తురు చుక్క లేదు అని వేరే చెప్పనక్ఖరలేదు అనుకుంటా.





మన దేశం ఎంతగానో గర్వించదగ్గ మహామనీషి బిస్మిల్లాహ్ ఖాన్.

బిస్మిల్లా ఖాన్ జాతి ఆత్మ

భగవద్గీత చదవలేదు
ఖురాను కంఠస్తం చెయ్యలేదు
కానీ అతనొక మహా శివరాత్రి
కాశీ విశ్వేశ్వరాలయంపైన నెలవంకను తగిలించాడు

మానస సరోవరాల ఘనీభవనంతెలియదు
మనుషులు శిలలుగా మారే వైనం కూడా తెలీదు
కాని అతను శిలలను ద్రవీకరించె అద్భుత ప్రక్రియ కనుగొన్నాడు

గాత్రంతొ గారడీలు చెయ్యలేదు
స్తోత్రపారాయణాలూ చెయ్యలేదు
కానీ అతను
మనుషుల పందిరిమీద
సప్తసువాసనల లతనెదో పాకించాడు

నదీ స్నానాలు చెయ్యలేదు
కొండలు గుట్టలు ఎక్కలెదు
కాని అతను
గంగాబాలను తన ముంగాళ్ళమీద
సురస్వరాల ఉయ్యాలలూగించాడు

ఏకాంత మానవద్వీపాలు చూడలేదు
విచ్ఛిన్న శకలాల గూర్చి వినలెదు
కాని అతను
ఒకేసారి అరవై మందిని
ఉమ్మడి గా వాటెసుకున్నాడు

మహా దార్శనికుడేమీకాడు
ప్రవక్త అంతకన్నా కాడు
కానీ అతను
గుండెనిలువునా తెరిచి
తన జాతి ఆత్మను ప్రపంచానికి ప్రదర్శించాడు
అతను బిస్మిల్లా ఖాన్

Courtesy - ప్రజా సాహితి ,డిశంబర్ 2006

Friday, December 15, 2006

విద్వాన్ విశ్వంగారి కవితా కౌశలం - పెన్నేటిపాటలో

విద్వాన్ విశ్వంగారి కవితా కౌశలం చూడండి వారి పెన్నేటిపాటలో ...

సర్కారు సిబ్బంది సరిజేయుటకు కొంత,
సాలు జమాబంది పాలు కొంత;
పొరుగూరి మన్నీల సరఫరా కింత,
ఆలేకార్ల లంచాలలోకి కొంత;
పేట పెద్ద వకీలు పిళ్లెకు కొంత,
కాంపౌండరు మునుసామి పాలు కొంత;
కోడెరెడ్లకు కొంత, గుఱ్ఱాలకై కొంత,
బగ్గీలకై కొంత, భటుల కింత;
పెద్ద మహడీలు కట్టిన పేర కొంత,
పూటపడి అచ్చవలసిన పాలు కొంత,
తన వివాహాలు నాల్గింటికిని మఱింత,
కొంత కొంతయె ఖర్చు కొండంత యయ్యె.

పుట్టపర్తి వారిని సరస్వతీ పుత్ర అని ఊరకే అన్నారా ?

పుట్టపర్తి వారి శివతాండవములోని ఒక అద్భుత పద్యాన్ని చూడండి. సరస్వతీ పుత్ర అని ఊరకే అన్నారా ?

తమ్ములై, ఘటితమోదమ్ములై, సుకృతరూ
పమ్ములై, శాస్త్రభాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచపుష్పమ్ములై, దుమ్మెదల
తమ్ములై, భావమంద్రమ్ములై, హావఫు
ల్లమ్ములై, నూత్న రత్నమ్ములై, వల్గుహా
సమ్ములై, గన్గొనలసొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్తకిసలమ్ములై, రక్తిచి
హ్నమ్ములై, తంద్రగమనమ్ములై గెడఁగూడి
కులుకునీలపుఁగండ్లఁ దళకుజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

పుట్టపర్తి వారి శివతాండవములోని అద్భుత పద్యాన్ని చూడండి

పుట్టపర్తి వారి శివతాండవములోని ఇంకొక అద్భుత పద్యాన్ని చూడండి

మొలక మీసపుఁగట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువు సేయ, మనసు నిండుగఁ బూయ
ధణధణధ్వని దిశాతతి బిచ్చలింపంగ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

Saturday, December 09, 2006

అద్భుతమయిన కవితా సంకలనం! యమాద్భుతంగా ఉంది

అద్భుతమయిన కవితా సంకలనం

రచించిన కవి వయసు పాతికే కానీ రచన మటుకు పండిపోయింది. యమాద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి రచన మన వద్దకు తీసుకువచ్చిన మాగంటి వారికి ధన్యవాదాలు.

ఈ పుటకి వెళ్ళి "తెలుగోడు" మీట నొక్కండి.

"అద్భుత పద్య గద్య" సమూహంలో ఉన్న "తెలుగోడు" మీట నొక్కండి.

అంత మీట వెతుక్కునే ఓపిక లేదా...అయితే ఇక్కడ చదవండి

"తెలుగోడు"